70th NSSO Report in Telugu – Survey of Agricultural Households – వ్యవసాయ కుటుంబాల పరిస్థితి

70th NSSO Round Survey Report in Telugu

70th Round NSSO Report in Telugu – Survey of Agricultural Households – వ్యవసాయ కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై 70వ జాతీయ నమూనా సర్వే

భారతదేశంలోని వ్య్వవసాయ కుటుంబాల ఆర్ధిక స్థితిగతులు, ఆస్తులు, రుణాలకు సంబంధించిన లెక్కలపై జాతీయ స్థాయిలో కేంద్రం చేపట్టిన 70వ జాతీయ నమూనా సర్వే (నేషనల్ శాంపిల్ సర్వే/ ఎన్ఎస్ఎస్) గణాంకాలు వెల్లడయ్యాయి.

సర్వేలోని ముఖ్యాంశాలు – తెలుగు రాష్ట్రాల పరిస్థితి:

  • తెలుగు రాష్ట్రాల కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. దేశంలో అన్ని రంగాలను కలిపి చూసినా, వ్యవసాయ రంగంలో అయినా తెలుగు కుటుంబాలకే అత్యధికంగా అప్పులున్నట్లు తేలింది.
  • దేశవ్యాప్తంగా ప్రజలకున్న ఆస్తుల విలువ, రుణాలపై 2012లో జాతీయ నమూనా సర్వే చేశారు.
  • రుణ భారం అధికంగా ఉన్న గ్రామీణ కుటుంబాల్లోనూ తెలంగాణ రైతు కుటుంబాలే అత్యధిక శాతం. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి కుటుంబాలకు సగటున 694 రైతు కుటుంబాలు నగదు అప్పుగా తీసుకున్నాయి. ఒక్కో కుటుంబానికి సగటున రూ.68,485 అప్పు ఉంది. మరే రంగానికి చెందిన కుటుంబాలకు ఇంత అప్పులేదు.
  • పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబంగ లాంటి ప్రాంతాల్లో కూడా రైతు కుటుంబాలకు సగటు నగదు అప్పు తెలంగాణలో ఉన్నదాంట్లో సగం కూడా లేదు.
  • దేశంలోనే సగటు అప్పు ఎక్కువున్న కుటుంబాల శాతంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపి చూసినా తెలంగాణలో 59.1% కుటుంబాలకు అప్పులున్నాయి. గ్రామీణ ప్రాంతాల రైతుల్లో ఇది 69.4 శాతంగా ఉంది.
  • దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వేను 2012 జూన్ 30 నాటికి ఉన్న లెక్కల ఆధారంగా ప్రకటించారు. అప్పటికి తెలంగాణ రాష్ట్రం లేనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ జిల్లాల వివరాలతో ఈ గణాంకాలు ప్రకటించారు.
  • తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతరుల్లో 47.9% మందికి అప్పులున్నాయి. పట్టణాల్లోనూ రైతు కుటుంబాల్లో 38.9%, ఇతరుల్లో 26.8% కుటుంబాలకు అప్పులున్నాయి.
  • జాతీయ స్థాయి అప్పుల చిట్టాలో గ్రామీణుల రుణాల విషయంలో దేశవ్యాప్తంగా తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లోని 54.1% మందికి అప్పులున్నాయి. గ్రామీణ ప్రాంతాల రుణ చిత్రాన్ని పరిశీలిస్తే రైతుల్లో 62.8% మందికి, వ్యవసాయేతరుల్లోనూ 47.1% మందికి అప్పులున్నాయి. పట్టణాల్లో సొంతంగా వ్యాపారం చేసుకునేవారిలో 51.3% మంది, ఇతరుల్లో 25.9% మంది రుణాల్లో ఉన్నారు.
  • పట్టణ ప్రాంతాల అప్పుల విషయంలో సగటున కేరళ 47 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో పుదుచ్చేరి (40.6%), ఆంధ్రప్రదేశ్ (39.8%), తమిళనాడు (34.8%), అండమాన్ నికోబార్ (30.6%), తెలంగాణ(30.5%) ఉన్నాయి.
  • సగటు ఆస్తుల లెక్కలు తీస్తే ఆంధ్రప్రదేశ్ 16వ స్థానం లోనూ, తెలంగాణ 12వ స్థానంలోనూ నిలిచాయి. ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో గృహస్థ సగటు ఆస్తి విలువ రూ.4.12 లక్షలుగా ఉంటే, పట్టణాల్లో ఆ విలువ రూ.9.91 లక్షలుగా ఉంది. తెలంగాణ గ్రామీణుల్లో రూ.6.37 లక్షలు, పట్టణాల్లో రూ.18.43 లక్షలు ఆస్తి ఉంది.
  • పట్టణ ప్రాంతాల్లో దేశంలోకెల్లా ఆస్తికి అత్యధిక విలువ చండీగఢ్‌లో ఉంది. ఇక్కడ ఒక్కో కుటుంబ ఆస్తి సగటు విలువ రూ.94.25 లక్షలతో అగ్రస్థానంలో ఉంది. మరే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని కుటుంబాలకున్న ఆస్తి విలువ ఇందులో సగం కూడా లేకపోవడం విశేషం. రెండో స్థానంలో మహారాష్ట్ర పట్టణ ప్రాంతాల కుటుంబ ఆస్తి సగటు విలువ రూ.43.37 లక్షలుగా నమోదైంది.
  • గ్రామీణ ఆస్తి విలువను పరిశీలిస్తే దేశంలో కెల్లా అత్యధికంగా దిల్లీ గ్రామీణ కుటుంబం ఆస్తి విలువ రూ.1.11 కోట్లుగా తేలింది. తర్వాత స్థానాల్లో హరియాణా రూ.46.16 లక్షలు, పంజాబ్ రూ.42.95 లక్షలు ఉన్నాయి.
  • జాతీయ స్థాయి గ్రామీణంలో సగటున 82.2%, పట్టణాల్లో 81.1% కుటుంబాలకు నగలుంటే దీనికంటే, చాలా ఎక్కువగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉండటం విశేషం. గ్రామీణంలో కర్ణాటకలో 94 శాతం, తమిళనాడు 91.6, తెలంగాణ 90% కుటుంబాలకు బంగారు నగలున్నట్లు తేలింది. ఈ విషయంలో ఏపీలో జాతీయ సగటు కంటే తక్కువగా 82% కుటుంబాలకే నగలున్నాయి.
  • పట్టణ ప్రాంతాల్లో కేరళ కుటుంబాల్లో 91.3, తమిళనాడు 89.4, కర్ణాటక 87.8%, తెలంగాణ 87.7% కుటుంబాలకు నగలున్నాయి. ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో 81.1% మందికి బంగారు నగలున్నాయి.
  • బ్యాంకు ఖాతాలు తెరిచిన గ్రామీణ కుటుంబాలు ఏపీలో 75.1% మంది ఉండగా, తపాలా ఖాతాలు 22.8% మందికి ఉన్నాయి. తెలంగాణ గ్రామీణంలో 73.7, పట్టణాల్లో 81.3% కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రతివెయ్యి కుటుంబాల్లో తెలంగాణలో కేవలం 2 కుటుంబాలకే ఉన్నాయి. తపాలా ఖాతాలు 40 కుటుంబాలకున్నాయి.
  • ఆస్తిపరులకు సంబంధించి సర్వేలో పది విభాగాలుగా విభజించారు. జాతీయ స్థాయిలో పల్లెల్లో తొలి 10% మందికి ఉన్న సగటు ఆస్తి రూ.57 లక్షలైతే చివరి 10% మంది సగటు ఆస్తి విలువ కేవలం రూ.25,071గా ఉంది.
  • పట్టణప్రాంతాల్లో తొలి 10% మందికి సగటున రూ.1.46 కోట్ల ఆస్తి ఉంటే, చివరి 10% మందికి రూ.291 మాత్రమే.
  • రైతుల కుటుంబాలకున్న ఆస్తి విలువను పరిశీలిస్తే అత్యధికంగా దిల్లీ రైతు కుటుంబానికి రూ.1.67 కోట్ల విలువైన ఆస్తి ఉంది. తర్వాత పంజాబ్‌లో రైతు కుటుంబ ఆస్తి విలువ రూ.88.51 లక్షలు, హరియాణాలో రూ.72.46 లక్షలుగా తేలింది. పంజాబ్ రైతు కుటుంబాల ఆస్తి విలువలో 15% కూడా తెలుగు రైతు కుటుంబాలకు లేకపోవడం గమనార్హం.
జాతీయస్థాయి ఆస్తులు – అప్పులు
సూచికలుగ్రామీణపట్టణ
ఆస్తులున్నవాళ్లు (శాతాల్లో)98.393.5
అప్పులున్నవాళ్లు (శాతాల్లో)31.422.4
సగటు ఆస్తులు (రూ.లక్షల్లో)10.722.85
సగటు అప్పు (రూపాయల్లో)32,52284,625
అప్పులున్నవారి సగటుఅప్పు (రూ.లక్షల్లో)1.033.78
రుణం, ఆస్తుల నిష్పత్తి(శాతాల్లో)3.23.7

Comment here!