APPSC & TSPSC Group -1, 2, 3 Indian Polity – ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు

APPSC TSPSC Group 1 Group 2 Group 3 Indian Polity Material Telugu, Indian Constitution Telugu

APPSC & TSPSC Group -1, 2, 3 Indian Polity – ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు

APPSC గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల సిలబస్ లోని ఇండియన్ పాలిటి మరియు భారత రాజ్యాంగం సబ్జెక్టులో అతి ముఖ్యమైన అంశాలు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు.

ముందుగా ప్రాథమిక హక్కులను పరిశీలిద్దాం.

ప్రాథమిక హక్కులు టాపిక్ లో ఎం చదవాలి? ఎలా చదవాలి? అనేది ముందుగా పరిశీలిద్దాం

  • భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఏ భాగంలో, ఏ ప్రకరణలో పొందుపరిచారు, ప్రాథమిక హక్కులు అనే భావనను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ప్రాథమిక హక్కులపై రాజ్యాంగ పరిషత్‌లో చర్చ వంటి విషయాలను ముందుగా అభ్యర్థులు గ్రహించాలి.
  • రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులను ప్రకరణలు, ఉపప్రకరణలతో సహా ఆధ్యయనం చేయాలి.
  • ప్రాథమిక హక్కుల అమలు విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీచేసే రిట్లను, వాటి సాంకేతిక పదాలను, అర్థాలను అధ్యయనం చేయాలి.
  • ప్రాథమిక హక్కుల స్వభావిక లక్షణాలను, విమర్శలు, ప్రాథమిక హక్కులపై సుప్రీంకోర్టు తీర్పులను, రాజ్యాంగ సవరణలను సమగ్రంగా చదవాలి.
  • డాక్ట్రిన్ ఆఫ్ సెవెరబిలిటి, డాక్ట్రిన్ ఆఫ్ వేవర్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే తెలుసుకోవాలి. ప్రాథమిక హక్కుల విభజన గురించి తెలుసుకోవాలి. తొలగించిన, చేర్చిన ప్రాథమిక హక్కులను తెలుసుకోవాలి.

డాక్ట్ట్రిన్ ఆఫ్ సెవెరబిలిటి (పృథకరించు సిద్ధాంతం): పార్లమెంటు చేసిన చట్ట ప్రకరణ 13 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఆ చట్టాలు చెల్లనేరవని సుప్రీంకోర్టు పేర్కొంటుంది. అయితే మొత్తం చట్టాన్ని రద్దు చేయకుండా చట్టంలోని ఏ భాగమైతే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందో ఆ భాగాన్ని మాత్రమే రద్దు చేస్తుంది. అలా వీలు కానప్పుడు మొత్తం చట్టాన్ని రద్దు చేస్తుంది. ఈ ప్రక్రియనే డాక్ట్రిన్ ఆఫ్ సెవెరబిలిటీ అంటారు. (ఎ.కె. గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, 1950 కేసు.)

డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ (ప్రతిషేధించు సిద్ధాంతం): రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు అమలు చేయాలి. అమలు చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వానికి మినహాయింపు లేదు. పౌరులు తమ హక్కులను వదులుకోవడాన్ని న్యాయస్థానం అనుమతించదు. ఈ ప్రక్రియనే డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అంటారు. (బషిశర్ నాథ్ వర్సెస్ ఇన్‌కం టాక్స్ కమిషనర్, 1959 కేసు)

డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ (గ్రహణ సిద్ధాంతం): రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విరుద్ధమయితే అవి చెల్లుతాయా లేదా అనే అంశాన్ని సుప్రీంకోర్టు ఈ ప్రక్రియను ఉపయోగించి నిర్ణయిస్తుంది. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విరుద్ధమయితే వాటిని పూర్తిగా కొట్టివేయదు. వాటి అమలును తాత్కాలికంగా నిలిపివేస్తుంది. ఆ తర్వాత వచ్చే చట్టాల ద్వారా వీటిని తొలగిస్తారు. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమయితే వాటిని పూర్తిగా రద్దు చేస్తారు. ఈ ప్రక్రియనే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటారు. (భికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్,1955 కేసు)

ప్రాథమిక హక్కుల కేసులపై సంక్షిప్త సమాచారం 

  1. ఎ.కె. గోపాలన్ వర్సెస్-తమిళనాడు కేసు 1950: ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం చెల్లదు (నివారక, నిర్భంద చట్టం చెల్లదు).
  2. చంపకం దొరైరాజ్ వర్సెస్ మద్రాస్-1951: రిజర్వేషన్స్ చెల్లవు.
  3. శంకరీ ప్రసాద్ వర్సెస్ ఇండియా -1951: న్యాయసమీక్షను మొదటిసారిగా ఉపయోగించారు. సాధారణ చట్టాల వలే రాజ్యాంగ సవరణలను సమీక్షించలేం సుప్రీంకోర్టు (మొదటి రాజ్యాంగ సవరణను సవాల్ చేయడం జరిగింది).
  4. బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం-1954: ప్రభుత్వం ప్రజల ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు, మార్కెట్ విలువతో కూడిన నష్టపరిహారాన్ని చెల్లించాలి.
  5. చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా -1961: సమానులలో మాత్రమే సమానత్వం అమలు.
  6. గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్-1967: ప్రాథమిక హక్కులను సవరించడానికి వీలులేదు (7వరాజ్యాంగ సవరణను ప్రశ్నించడం జరిగింది).
  7. కేశవానంద భారతి కేసు-1973: ప్రాథమిక హక్కులను పార్లమెంటు సవరించవచ్చు. ప్రాథమిక హక్కుల కేసు అంటారు. (25వ రాజ్యాంగ సవరణను ప్రశ్నించడం జరిగింది)
  8. మేనకాగాంధీ కేసు (పాస్‌పోర్ట్)-1978: విదేశాలకు వెళ్లేహక్కును నిరోధించరాదు.
  9. మినర్వామిల్ కేసు-1980: ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో అంతర్భాగం (ప్రకరణ 368 గురించి).
  10. ఓల్లా టెల్లిస్ వర్సెస్ బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ -1986 (పేవ్‌మెంట్ నివాసితుల కేసు): ప్రాణం అనే మాటలో జీవనోపాధి పొందే హక్కు ఉంటుంది.
  11. బిజోయ్ ఎమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ -1986: జాతీయ గీతానికి సంబంధించింది.
  12. పరమానంద ఖాతారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా -1989: ఆర్యోగం, వైద్య సదుపాయాలను పొందుట పౌరుల ప్రాథమిక హక్కు.
  13. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్-1991: కాలుష్య రహితమైన గాలి, నీరు పొందే హక్కు.
  14. ఇందిరా సహానీ వర్సెస్ ఇండియా (మండల్ కేసు) -1992: ఓబీసీల రిజర్వేషన్ చెల్లుబాటు గురించి.
  15. ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ -1993: జీవించే హక్కులో విద్యాహక్కు ఒక భాగం.
  16. ఎస్.ఆర్. బొమ్మై కేసు-1994: లౌకిక అనేది ప్రవేశికలో అంతర్భాగము.
  17. ఆర్. రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు -1994: ఆటో శంకర్ అత్మకథ కేసు.
  18. చమేలిసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్-1996: ఆశ్రయం పొందే హక్కు ప్రాథమిక హక్కు.
  19. జ్జాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ -1966: లోకేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎం.పి.1966, మారితీ శ్రీపతి దుబాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహరాష్ట్ర 1997, కేసులు మరణించే హక్కు ప్రాథమిక హక్కు కాదు.
  20. పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా -1997: వ్యక్తిగత గోప్యతా హక్కు (టెలిఫోన్ టాపింగ్).
  21. సి.పి.ఐ (ఎం) వర్సెస్ భరత్ కుమార్ -1998: బందులు చట్ట వ్యతిరేకం.
  22. మురళి దేవ్‌రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా -2002: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం.
  23. అరుణారాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా -2002: పాఠశాలల్లో అన్ని మతాలను ఆధారం చేసుకొని విద్యాబోధన చేయడం లౌకితత్వానికి వ్యతిరేకం కాదు.
  24. జావిద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా -2003: ఇద్దరు పిల్లల నియమం ప్రకరణ 25కు వ్యతిరేకం కాదు.
  25. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా- 2004: సమాచారం పొందటం ప్రాథమిక హక్కు.
  26. అరుణ షాన్‌బాగ్- 2011: కారుణ్య మరణం నిషేధం.

సుప్రీంకోర్టు ఆరుణ షాన్‌బాగ్ కేసులో 2011 మార్చి 7న తీర్పునిస్తూ కారుణ్య మరణనాన్ని తిరస్కరించింది. అయితే చట్టపరంగా అందించే జీవితకాల సాయాన్ని తొలగించే అవకాశం ఉందని, ఇది కేవలం అత్యంత అరుదైన వ్యాధుల బారినపడిన అతికొద్ది మంది రోగులకు మాత్రమే అనుమతించవచ్చునని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రాణాంతక పదార్థాల ద్వారా కాకుండా ప్రాణాలు నిలిపేందుకు ఉపయోగిస్తున్న పరికరాలను తొలగించడం ద్వారా సహజంగా మరణించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ప్యాసివ్ యుథనేషియా అంటే చికత్స, ఆహారం అందించడం నిలిపివేయడం. ప్యాసివ్ యుథనేషియా ఆరుణ షాన్‌బాగ్‌కు వర్తించదని కోర్టు పేర్కొంది. ఆరుణ షాన్‌బాగ్ కేసులో సుప్రీంకోర్టు దేశంలో తొలిసారిగా కారుణ్య మరణానికి పాక్షిక చట్టబద్ధతను కల్పించింది.

ఆదేశిక సూత్రాలు 

ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఏ భాగంలో, ఏ ప్రకరణలో పొందుపరిచారు, వాటి స్వభావిక లక్షణాలేమిటి? ప్రకరణల వారీగా వాటిని అధ్యయనం చేయాలి. నూతనంగా చేర్చిన ఆదేశిక సూత్రాలేవి? ఏ రాజ్యాంగ సవరణల ద్వారా వేటిని చేర్చారు. ఆదేశిక సూత్రాల అమలు, విమర్శణాత్మక పరిశీలన, ప్రముఖుల వ్యాఖ్యానాలు, ఆదేశిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు మధ్యగల వ్యత్యాసాలు, సుప్రీంకోర్టు తీర్పులను అభ్యర్థులు చదవాలి.

 

ప్రాథమిక విధులు 

ఈ టాపిక్ కింద ప్రాథమిక విధులు మౌలిక రాజ్యాంగంలో ఉన్నాయా? కాలక్రమంలో చేర్చారా? ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఏ కమిటీ సూచన మేరకు వీటిని రాజ్యాంగంలో చేర్చారు. రాజ్యాంగంలో ఏ భాగంలో ఏ ప్రకరణలో పొందుపరిచారు. ఇటీవల చేర్చిన ప్రాథమిక విధి ఏది? ప్రాథమిక విధులపై ప్రముఖుల వ్యాఖ్యానాలు, ప్రాథమిక విధుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? జస్టిస్ వర్మ కమిటీ సూచనలను అభ్యర్థులు సమగ్రంగా చదవాలి.

ప్రకరణ 51(ఎ) : ప్రతి పౌరుడి ప్రాథమిక విధులు

ఎ) రాజ్యాంగానికి బద్ధుడై ఉండుట, దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించుట.

బి) జాతీయ స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఉన్నతాదర్శాలను మనస్సుతో ఉంచుకొని వాటిని అనుసరించుట.

సి) భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతను సమర్థించుట, సంరక్షించుట.

డి) దేశమును రక్షించుట, కోరినప్పుడు జాతికి సేవ చేయుట.

ఇ) భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ, వర్గ వైవిధ్యములను అధిగమించి, సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించుట. స్త్రీల గౌరవాన్ని తగ్గించు ఆచారాలను విడనాడుట.

ఎఫ్) మన ఉమ్మడి సంస్కృతిని, సుసంపన్న సంప్రదాయాలను గౌరవించి రక్షించుట.

జి) అడవులు, సరస్సులు, నదులు, అడవి జంతువులతో సహా ప్రాకృతిక పరిసరాలను కాపాడి అభివృద్ధి చేయుట. సమస్త జీవుల పట్ల కరుణ కలిగి ఉండుట.

హెచ్) శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, జిజ్ఞాసను, సంస్కరణ తత్వాన్ని పెంపొందించుకొనుట.

ఐ) ప్రభుత్వ ఆస్తిని సంరక్షించుట, హింసను విడనాడుట.

జె) తమ వ్యక్తిగత, సమిష్టి చర్యల ద్వారా ప్రతి కార్య రంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయడం, తద్వారా దేశం అత్యున్నత శిఖరాలను అధిరోహించడం.

కె) ఆరు నుంచి పద్నాగేండ్ల వయస్సున్న బాలలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు విద్యార్జనకు అవకాశాలు కల్పించవలెను.
ఈ విధిని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ విధి 2002 డిసెంబర్ 12 నుంచి అములులోకి వచ్చింది.

పై విషయాలన్నీ లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటి పుస్తకంలో 7, 8, 9 చాప్టర్లలో కూలంకషంగా వివరించబడ్డాయి.

ప్రాక్టీసు ప్రశ్నలు 

  1. ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు?
    ఎ) రష్యా బి) ఫ్రాన్స్
    సి) ఐర్లాండ్ డి) అమెరికా
  2. ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపర్చారు?
    ఎ) 4వ భాగం బి) 3వ భాగం
    సి) 5వ భాగం డి) 6వ భాగం
  3. గ్రామ స్వరాజ్యం గురించి తెలియజేస్తున్న ప్రకరణ ఏది?ఎ) 44 బి) 45 సి) 40 డి) 41
  4. కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పిస్తున్న ప్రకరణ ఏది?
    ఎ) 43(ఎ) బి) 44(ఎ) సి) 43(బి) డి) 44(బి)
  5. ఆదేశిక సూత్రాలను నూతన సంవత్సరం ముందు రోజు రాత్రి తీసుకున్న తీర్మానాలు అని విమర్శించింది ఎవరు?
    ఎ) గ్రాన్‌విల్ ఆస్టిన్            బి) నసిరుద్దీన్‌షా
    సి) టి.టి. కృష్ణమాచారి      డి) ఐవర్ జన్నింగ్
  6. నిర్దేశిక నియమాలను సంపూర్ణంగా అమలుచేస్తే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది అని వ్యాఖ్యానించింది ఎవరు?
    ఎ) బి.ఆర్. అంబేద్కర్ బి) జవహర్‌లాల్ నెహ్రూ సి) ఎమ్.సి.చాగ్లా డి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
  7. రాజ్యాంగంలోని ఏ భాగం సంక్షేమ రాజ్యాన్ని తెలియజేస్తుంది?
    ఎ) ప్రవేశిక                    బి) ప్రాథమిక హక్కులు
    సి) ప్రాథమిక విధులు       డి) ఆదేశిక సూత్రాలు
  8. ఆదేశిక సూత్రాలను ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజలముందు జవాబుదారియై నిలువాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించింది ఎవరు?
    ఎ) జవహర్‌లాల్ నెహ్రూ    బి) బి.ఆర్. అంబేద్కర్
    సి) ఎమ్.సి. చాగ్లా            డి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
  9. మన దేశంలో ఉమ్మడి పౌరసృ్మతిని కలిగివున్న ఏకైక రాష్ర్టం ఏది?
    ఎ) సిక్కిం                     బి) రాజస్థాన్
    సి) గోవా                      డి) అరుణాచల్ ప్రదేశ్
  10. ఆదేశిక సూత్రాలు నేతి బీరకాయలో నేతిని వెతకడం వంటివి (ఫాబియన్ సోషలిజం) అని వ్యాఖ్యానించింది ఎవరు?
    ఎ) కె.టి. షా                  బి) సర్ ఐవర్ జన్నింగ్
    సి) కె.సంతానం               డి) డి.డి. బసు
  11. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఏ భాగంలో ఏ ప్రకరణలో చేర్చారు?
    ఎ) భాగం 4 ప్రకరణలు 12 నుంచి 35 వరకు
    బి) భాగం 3 ప్రకరణలు 12 నుంచి 35 వరకు
    సి) భాగం 4 ప్రకరణలు 11 నుం 36 వరకు
    డి) భాగం 3 ప్రకరణలు 11 నుంచి 36 వరకు
  12. ప్రాథమిక హక్కులు అనే భావన ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
    ఎ) బ్రిటన్ బి) ఫ్రాన్స్ సి) జర్మనీ డి) అమెరికా
  13. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలునాటికి ప్రాథమిక హక్కుల సంఖ్య ఎంత?
    ఎ) ఏడు                       బి) తొమ్మిది
    సి) పదకొండు                డి) ఆరు
  14. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా తొలగించారు?
    ఎ) 43వ సవరణ                     బి) 44వ సవరణ
    సి) 42వ సవరణ                    డి) 46వ సవరణ
  15. ప్రస్తుతం ఆస్తిహక్కు చట్టబద్ధ హక్కుగా ఏ ప్రకరణలో ఉంది?
    ఎ) 300 ప్రకరణ                     బి) 300(ఎ) ప్రకరణ
    సి) 326 ప్రకరణ                     డి) 50(ఎ) ప్రకరణ
  16. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు నిచ్చింది?
    ఎ) 1967 గోలక్‌నాథ్ కేసు            బి) 1973 కేశవానంద భారతి కేసు
    సి) 1994 ఎస్‌ఆర్ బొమ్మై కేసు    డి) పైవన్నీ
  17. ప్రాథమిక హక్కులను పౌరులు వదులుకోవడాన్ని న్యాయస్థానం అనుమతించదు. ఈ ప్రక్రియను న్యాయ పరిభాషలో ఏమంటారు?
    ఎ) డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్               బి) డాక్ట్రిన్ ఆఫ్ వేవర్
    సి) డాక్ట్రిన్ ఆఫ్ సెవెరబిలిటి         డి) ఏదీకాదు
  18. ప్రకరణ 19(2ఎ) దేనిని పేర్కొంటుంది?
    ఎ) దేశసార్వభౌమత్వాన్ని సవాలు చేయరాదు
    బి) దేశ సమైఖ్యత, సమగ్రతలకు భంగం వాటిల్ల జేయరాదు
    సి) శాంతిభద్రతలకు భంగం కలిగించరాదు
    డి) కోర్టు ధిక్కారానికి పాల్పడరాదు
  19. బాలకార్మిక వ్యవస్థను నిషేధిస్తున్న ప్రకరణ ఏది?
    ఎ) 23వ ప్రకరణ             బి) 26వ ప్రకరణ
    సి) 24వ ప్రకరణ             డి) 25వ ప్రకరణ
  20. న్యాయ పరిభాషలో హెబియస్‌కార్పస్ అంటే?
    ఎ) శరీరాన్ని కలిగి ఉండుట                 బి) మేము ఆదేశిస్తున్నాం
    సి) మీ అధికారం ఏంటి              డి) ఏదీకాదు
  21. ప్రకరణ 32 ప్రకారం పౌరులకు లభించే రిట్లు ఏవి?
    1. హెబియస్‌కార్పస్ 2. మాండమస్
    3. ప్రొహిబిషన్ 4. సెర్షియోరరీ 5. కోవారెంటో
    ఎ) 1, 2, 3           బి) 2, 3, 4
    సి) 1, 3, 5           డి) 1, 2, 3, 4, 5
  22. పౌరులందరికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశమని ఏ ప్రకరణ పేర్కొంటుంది?
    ఎ) ప్రకరణ 14        బి) ప్రకరణ 13
    సి) ప్రకరణ 16       డి) ప్రకరణ 15

జవాబులు : 1.సి, 2.ఎ, 3.సి, 4.ఎ, 5.బి, 6.సి, 7.డి, 8.బి, 9.సి, 10.బి

Comment here!