
Environmental Movements in India – పర్యావరణ ఉద్యమాలు
భారత దేశంలో పర్యావరణాన్ని రక్షించడానికి అనేక ఉద్యమాలు జరిగాయి. వాటిని మనం పరిశీలిద్దాం.
నర్మదా బచావో ఆందోళన్
- నర్మదా నదిపై 1961 నుంచి నిర్మాణంలో ఉన్న సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, నర్మదాసాగర్ డ్యామ్‌లతో లక్షలాది మంది స్థానిక గిరిజనులు, రైతులు, సామాన్య ప్రజలు నిరాశ్రయులుకావడంతో పాటు పర్యావరణ సమతుల్యత (ECOLOGICAL BALANCE) దెబ్బతింటుందని ప్రముఖ పర్యావరణ ఉద్యమ నాయకురాలు మేథాపాట్కర్ నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమాన్ని ప్రారంభించింది.
- భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే నర్మదా నదికి మత, సాంస్కృతిక, జీవనపరంగా అధిక ప్రాముఖ్యం ఉంది.
- 1980వ దశకంలో తీవ్రరూపం దాల్చిన నర్మదా బచావో ఆందోళన్ నర్మదా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రపంచబ్యాంక్ అందిస్తున్న ఆర్థికసహాయాన్ని వెంటనే నిలిపివేయాలని పోరాటం చేశారు.
- ఈ ఉద్యమ ప్రభావంతో నర్మదా నది నిర్మాణానికి సంబంధించి 1991లో ప్రపంచ బ్యాంక్ మూర్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది.
- సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా మేథోపాట్కర్తో పాటు బాబా ఆమ్టే, నందితాదాస్, అరుంధతిరాయ్ వంటి పర్యావరణ ఉద్యమకారులు ఉద్యమించారు.
- ఈ ఉద్యమం ప్రభావంతో నర్మదా ట్రిబ్యునల్ ఏర్పాటయ్యింది.
- నర్మదా బచావో ఆందోళన చివరకు ఒక ప్రజా ఉద్యమంగా మారడం, సుప్రీంకోర్టులో దీనిపై వ్యాజ్యాలు వేయడంతో సుప్రీంకోర్టు సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించింది.
తెహ్రీబంద్ విరోధి సంఘర్ష్ సమితి
- ఉత్తరాఖండ్‌లో భగీరథ, భిలంగన్ నదుల సంగమం వద్ద తెహ్రిడ్యామ్ను నిర్మించి సాగునీటి కల్పన, జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించి 1949లో పనులను ప్రారంభించారు.
- ఈ డ్యామ్ నిర్మాణ ప్రాంతం పర్యావరణపరంగా అత్యంత సునిశిత ప్రాంతం. దీని నిర్మాణంతో సుమారు 100 గ్రామాలు పూర్తిగా, మరో వంద గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.
- డ్యామ్ నిర్మాణంతో సుమారు వెయ్యి హెక్టార్ల సాగుభూమి, వెయ్యి హెక్టార్ల అటవీ భూమి, మరో రెండువేల హెక్టార్ల పశుగ్రాస భూములు ముంపునకు గురికావడంతో పాటు భూకంపాలు సంభవించే తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
- డ్యామ్ నిర్మాణం తర్వాత భూకంపాలు సంభవించి డ్యామ్ కూలిపోతే హరిద్వార్ రిషికేష్‌లో నివసించే ప్రజలు ముంపునకు గురవుతారు.
- ఈ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా తెహ్రీబంద్ విరోధి సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో పర్యావరణ ఉద్యమం జరిగింది.
- ఈ ఉద్యమం ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో తెహ్రీడ్యామ్ నిర్మాణంతో కలిగే ప్రమాదాల గురించి చర్చలు మొదలయ్యాయి.
అప్పికో ఉద్యమం
- చిప్కో ఉద్యమం స్ఫూర్తితో ఉత్తర కర్ణాటకలోని కలాసేకుదోర్ అటవీ ప్రాంతంలో 1983లో అప్పికో ఉద్యమం ప్రారంభమైంది.
- అటవీ శాఖ నుంచి అనుమతి పొందిన కాంట్రాక్టర్లు విచక్షణారహితంగా అడవులను నరికి కలపను వ్యాపారం చేసుకొనేవారు.
- ఈ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న సల్కని, బాలెగద్దె, మనన్దోర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు చిప్కో ఉద్యమం మాదిరిగానే చెట్లను నరకకుండా వాటిని హత్తుకొని రక్షించుకున్నారు.
- లక్ష్మీ నరసింహ యువమండలి అనే సంస్థ అప్పికో నిర్వహించిన ఉద్యమం జాతీయస్థాయి ఉద్యమంగా మారింది.
- ఈ ఉద్యమ ప్రభావంతో ఉత్తర కర్ణాటక ప్రాంతంలో సామాజిక అడవుల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
గంగా సంరక్షణ ఉద్యమం
- హిందువులకు అత్యంత పవిత్ర నదిగా పరిగణించబడుతున్న గంగానది పరిరక్షణ కోసం గాంధీ మనుమరాలు తారాగాంధీ భట్టాచార్జీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
- గంగానది పరిరక్షణ కోసం అహింసామార్గంలో సాగిన గాంధీయన్ పర్యావరణ ఉద్యమం ఇది.
- గంగా నది పరీవాహక ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు పరిమితికి మించి ఆవాసాల ఏర్పాటుతో గంగానది ప్రమాదకరస్థాయిలో జలకాలుష్య సమస్యను ఎదుర్కొంటుంది.
- దేశంలో వ్యవసాయానికి, మానవ జీవనానికి, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న గంగానదిని రక్షించుకోవడమే ఈ ఉద్యమం అంతిమలక్ష్యం.
- ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా గంగా నది పరిరక్షణ కోసం, ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటుచేసింది.
కోయెల్కరో ఉద్యమం
- జార్ఖండ్‌లో చేపట్టిన కోయెల్కరో జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక ఒరాన్, మూండా గిరిజన తెగలు జరిపిన పర్యావరణ ఉద్యమం ఇది.
- కోయెల్కరో జన్ సంఘర్షణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది.
- కామ్ రకో ఆందోళన్ నినాదంతో స్థానిక ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించింది.
- దేశంలో అత్యంత శక్తివంత పర్యావరణ ఉద్యమంగా పరిగణించబడ్డ కోయెల్కరో ఉద్యమం ప్రభావంతో విచ్చలవిడిగా ప్రాజెక్టు చేపట్టకుండా నిరోధించింది.
చిప్కో ఉద్యమం
- పర్యావరణంలో అత్యంత ప్రధాన అడవులను రక్షించుకొనేందుకుగాను నాటి ఉత్తరప్రదేశ్ (నేటి ఉత్తరాఖండ్)లోని చమోలీ జిల్లాలో 1973లో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది.
- సుందర్‌లాల్ బహుగుణ నాయకత్వంలో స్థానిక మహిళలు అడవుల పరిరక్షణలో క్రియాశీల పాత్ర పోషించారు.
- చమోలీ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఒక పెద్ద రాజభవనాన్ని నిర్మించాలని తన సేవకులను ఆదేశిస్తాడు. దీనికోసం సేవకులు చెట్లను నరకడం ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక బాలిక అమిత్రాదేవి చెట్లను నరకకుండా వాటిని కౌగిలించుకొని చెట్లను నరకాలంటే ముందు నా తలను నరకాలని హెచ్చరిస్తుంది. రాజు ఆదేశాల మేరకు సేవకులు ఆమె తలను నరికివేస్తారు. ఈ సంఘటనతో స్థానిక మహిళలందరూ సంఘటితంగా చెట్లను నరకకుండా వాటిని కౌగిలించుకొని (చిప్కో) అడవులను కాపాడుకున్నారు.
- సుందర్‌లాల్ బహుగుణ స్థానిక మహిళల సహకారంతో అడవులను పరిరక్షించేందుకు ప్రజలను చైతన్యపర్చారు. పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధే నిజమైన అభివృద్ధి అని నాటి ప్రభుత్వాలను మెప్పించగలిగాడు.
- పర్యావరణ సత్యగ్రహం రూపంలో మొదట స్థానిక గిరిజన మహిళలు పాల్గొని పర్యావరణ మహిళా ఉద్యమాలను (ECOFEMINISM) ప్రారంభించారు.
- చిప్కో ఉద్యమంలో భాగంగా చండీప్రసాద్ భట్ (CHANDI PRASAD BHAT) కుటీర, చిన్న తరహా, అటవీ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం అనేక విధాలుగా కృషి చేశారు.
- చిప్కో ఉద్యమం తీవ్రతను గమనించిన నాటి రాష్ట్ర ప్రభుత్వం అడవుల నరికివేతను నిషేధించడడమే కాకుండా అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
- చిప్కో ఉద్యమం ప్రభావంతో హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమకనుమలు, బీహార్, వింద్యాసాత్పూర పర్వతాల్లో అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టారు.