Should I prepare for Civils or Groups?

సివిల్సా? గ్రూప్సా?

ఒకవైపు సివిల్ సర్వీసెస్ పరీక్ష, మరోవైపు గ్రూప్‌-1, 2, 3 నియామక ప్రకటనలు. వీటిలో దేనికి ప్రిపేర్ అవ్వాలన్నది చాలా మంది అభ్యర్థులకు అసలు పరీక్ష. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్స్ పరీక్షలు కూడా రాస్తే సివిల్స్‌కు అవసరమైన ఏకాగ్రత పల్చబడిపోతుందా? సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షల్లో సారూప్యతలేమిటి? తేడాలేమిటి?

ఇలాంటి చిక్కు సమస్య పోటీ పరీక్షల అభ్యర్థుల్లో ఇప్పుడు చాలామందికి ఎదురవుతున్నదే. ఇలాంటి సందర్భాల్లో వూగిసలాట సహజం. ఇలాంటి ఒత్తిడి పెరిగినకొద్దీ నిర్ణయం తీసుకోలేకపోవటం జరుగుతుంది. విలువైన సమయం వృథా అవుతుంది.

సివిల్స్, గ్రూప్స్ పరీక్షల మధ్య సారుప్యతలు:

*అన్ని పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షల (గ్రూప్‌-1, 2, సివిల్స్‌) సిలబస్‌ లో ఎన్నో సారూప్యతలుంటాయి. ఉమ్మడి అంశాలుంటాయి. జనరల్‌ స్టడీస్‌ దాదాపుగా అన్ని పరీక్షలకు ఒకటే. ఒకే సన్నద్ధత అన్ని పరీక్షలకూ ఉపయోగపడుతుంది. ప్రతి పరీక్షకూ కొన్ని అదనపు అంశాలను చదువుకుంటే సరిపోతుంది.

*గ్రూప్‌-1 , గ్రూప్‌-2 పరీక్షలకు హాజరవటం వల్ల పోటీపరీక్షలకు అవసరమైన అనుభవం లభిస్తుంది. ఒకవేళ మీరు ఆ పరీక్షల్లో అర్హత పొందలేకపోతే మీ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో గ్రహించవచ్చు. వెంటనే లోపాలు సవరించుకోవచ్చు. అర్హత పొందితే సివిల్స్ కు అవసరమైన ఆత్మవిశ్వాసం లభిస్తుంది.

*అన్ని పోటీ పరీక్షల్లోనూ కొంత అదృష్టం పాత్ర ఉంటుంది. సివిల్స్‌ను మీరు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ ఏడాది మీకు అనుకూలించకపోవచ్చు. కానీ గ్రూప్‌-1 కానీ, గ్రూప్‌-2 కానీ సాధించినపుడు- సివిల్స్ కు మళ్ళీ ఉత్సాహంగా సిద్ధమవటానికి కావలసిన ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు.

*యూపీఎస్‌సీ ఇంటర్‌వ్యూలో బోర్డుకు మీపై ఓ అనుకూల అభిప్రాయం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే:
1) ఒకవేళ గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 కు సెలెక్ట్ ఐతే అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసులకు అభ్యర్థి తగినవాడని రుజవుచేసుకున్నాడు. పాలనా బాధ్యతలు స్వీకరించటానికి అవసరమైన లక్షణాలు ఇతడిలో ఉన్నాయి.
2) అన్ని పరీక్షలకూ హాజరవుతున్నాడు కాబట్టి ఇతడికి ప్రభుత్వంలో పనిచేయటానికి సిసలైన అభిలాష ఉందని అర్థమవుతోంది.
3) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు అవసరమైనది ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్‌ ‘బి’). ఇది తనకుందనే లక్షణాన్ని అభ్యర్థి ప్రదర్శించాడు.
మీరు ఈ వాదనలన్నీ అంగీకరిస్తే, ఇప్పటికి వచ్చిన గ్రూప్స్‌ ప్రకటనలు మంచి అవకాశాలను గుర్తించగలుగుతారు. దాంతో అన్ని పరీక్షలకూ ఉత్సాహంగా సిద్ధం కాగలుగుతారు.

తేడాలు:

* గ్రూప్‌-1/గ్రూప్‌-2 సిలబస్‌ సివిల్స్‌ ప్రిలిమినరీ కంటే ఎక్కువ ఉంది. గ్రూప్‌-1/ గ్రూప్ -2 లో రీజనల్‌ హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సొసైటీ అండ్‌ రీజనల్‌ కరంట్‌ అఫైర్స్‌ ఉన్నాయి

* గ్రూప్‌-1/గ్రూప్‌-2లలో స్థానికాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సివిల్స్‌లో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అధిక దృష్టి అవసరం.

* సివిల్‌ సర్వీసెస్‌లో లోతైన అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. గతంలో జరిగిన గ్రూప్‌-1 పరీక్షలన్నిటిలో ప్రశ్నలు ప్రాథమికాంశాలపైనే ఉన్నాయి. లోతైన అవగాహన రావాలంటే సబ్జెక్టులోని ప్రాథమికాంశాల పరిజ్ఞానం తప్పనిసరి. కాబట్టి సివిల్స్ కు సిద్ధమవటం అంటే మరోరకంగా గ్రూప్‌-1కు కూడా సన్నద్ధమవటం అన్నమాట!

* అన్ని రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లూ యూపీఎస్‌సీ రూపొందించే ప్రశ్నల శైలిని అనుకరించటం ప్రస్తుత ధోరణిగా ఉంది.

* సివిల్స్ కు సంబంధించి ఎకానమీ లాంటి అంశాల్లో సంపూర్ణ అవగాహన అవసరమవుతుంది. ఇక్కడ విడివిడి సూక్ష్మాంశాలకు కూడా ప్రాధాన్యం. గ్రూప్‌-1లో స్థూల అవగాహన (విహంగ వీక్షణం) సరిపోతుంది. మొదటి అవగాహన రెండోదాన్ని సులువు చేసేస్తుంది.

ఈ రకంగా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షాంశాల అధ్యయనం ద్వారా పొందే పరిజ్ఞానం, గ్రూప్‌-1, గ్రూప్ 2 పరీక్షలకు అవసరమైనదానికంటే ఎక్కువే!

కనుక సివిల్స్ తో పాటు అన్ని పరీక్షలూ రాస్తాను అనే వ్యూహమే సరైన వ్యూహం. ఇలా అన్ని పరీక్షలూ రాయాలనే నిర్ణయం తీసుకుంటే, సివిల్‌ సర్వీసుల పరీక్షకూ, గ్రూప్స్‌ పరీక్షలకూ ఉమ్మడి సన్నద్ధత ఆరంభించాల్సివుంటుంది.

వ్యూహం:

1. గ్రూప్‌-1,2 పరీక్షల్లో రాగల సైన్స్‌ ప్రాథమికాంశాలను బాగా చదవండి. పునశ్చరణ చేసుకోవాలి. వాటిని తాజా పరిణామాలకు అన్వయించండి. ఇది రెండు పరీక్షలకూ ఉపయోగమే.

2. ఇండియన్‌ హిస్టరీ అండ్‌ జాగ్రఫీని చదవండి. ఇది రెండు పరీక్షలకూ ప్రయోజనకరం.

3. జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలను స్థూలంగా- విహంగ వీక్షణంతో అర్థం చేసుకోండి. ప్రధానమంత్రి సందర్శించిన దేశాలు/ మనదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు చాలా ముఖ్యం. అలాగే ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన ప్రముఖులకు చెందిన దేశాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలి. రెండు పరీక్షలకూ ఈ అంశాలు అవసరమే. ఇలాంటి అంశాలపై అవగాహనను తాజా పరిణామాల పరిజ్ఞానంతో పటిష్ఠం చేసుకుంటూపోవటం ప్రతిరోజూ జరగాలి.

4. రాష్ట్రానికి సంబంధించిన వర్తమాన అంశాలు, ఆర్థిక సమాచారం కోసం విడి పుస్తకం నిర్వహించటం మంచిది. జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలను వాటికి కలపకూడదు.

5. ప్రాంతీయ భౌగోళిక అంశాలపైనా, రాష్ట్రం ఎదుర్కొనే సామాజిక సమస్యలపైనా ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.

6. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలనూ సేకరించాలి. ప్రముఖ మ్యాగజీన్లూ, వెబ్‌సైట్లూ వీటిని ప్రచురిస్తుంటాయి. ఈ ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తుండాలి.

7. మీ జవాబుల్లో సరైనవీ, సరికానివీ గమనిస్తుండాలి. తప్పుగా గుర్తించినవాటిపైనా, మీకు పెద్దగా తెలియని అంశాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి.

8. ఆ ప్రశ్నలకు సరైన సమాధానం తెలిసినంతమాత్రాన సరిపోదు. అంటే ఆ జవాబు ‘సి’నో, ‘బి’నో కనిపెట్టటంతో ఆగకూడదు. ఆ అంశం నేపథ్యం కూడా తెలుసుకోవాలి. ఆ కసరత్తు అవసరమే. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలనే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు.

9. రాష్ట్రస్థాయిలో జరిగిన పరీక్షలకు కూడా ఇలాంటి కసరత్తే చేయాలి. ఉదాహరణకు అసిస్టెంట్‌ ఇంజినీర్ల నియామకానికి ఓ పరీక్ష జరిగివుండొచ్చు. దానిలో కూడా జనరల్‌స్టడీస్‌ అంశాలు అదే సిలబస్‌తో ఉంటాయి. కాకపోతే ప్రాంతీయ చరిత్ర, సంస్కృతిలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలుంటాయి.

ఈ విధంగా ప్రిపేర్ అయితే సివిల్స్, గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 లో ఒక పోస్ట్ మీదే అవుతుంది.

2 thoughts on “Should I prepare for Civils or Groups?”

Comment here!