Telangana History – Sardar Sarvai Papanna – సర్దార్ సర్వాయి పాపన్న

Sardar Sarvai Papanna History

Telangana History – Life Story of Sardar Sarvai Papanna

History of Sardar Sarvai Papanna is a subtopic of TSPSC Group 1 Telangana History Subject.

సర్దార్ సర్వాయి పాపన్నజీవిత చరిత్ర

1687లో తెలంగాణను పాలించే గోల్కొండ రాజ్యాన్ని మెఘల్ సామ్రాట్ ఔరంగజేబు ఓడించి దక్కన్ సుబాగా చేసి ఒక గవర్నరు పాలనలో ఉంచాడు. సుబా అధికారులు ఇక్కడి స్థానికులు కాదు. కాబట్టి వారు ప్రజా సంక్షేమం కోసం పనిచేయకుండా పన్నుల వసూలు, వీలైనన్ని విధాల వ్యక్తిగత సంపాదనల మీదే దృష్టి పెట్టేవారు. ప్రత్యక్ష పరిపాలన లేకపోవడం వల్ల అలాంటి ముస్లిం సర్దారుల అండతో జమీందార్లు కూడా ప్రజలనే హింసించడం మొదలుపెట్టారు. బాధిత ప్రజల్లో 14వ శతాబ్దం నుంచి తెలంగాణలో స్థిరపడుతూ వచ్చిన ముస్లింలు కూడా ఉన్నారు. అంటే హిందూ ముస్లింలు అందరూ 17వ శతాబ్దానికల్లా ఒక స్థానిక సంక్షేమ ప్రభుత్వ ఏర్పాటును కోరుకున్నారు.

ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని జనగామ ప్రాంతంలో నాచగోని సర్వాయి పాపన్న పుట్టాడు. ఇతడు తెలంగాణలో స్థానిక పరిపాలనను ప్రవేశపెట్టాలనే గొప్ప ఆశయం కలవాడు. శారదకాండ్రు, వీరముష్టివారు అనే జానపదులు పాడే పాపన్న వీరగాథ ప్రకారం తన తల్లి సర్వమ్మ చూపిన చోట తవ్వి, ఏడు కొప్పెరల ధనం వెలికి తీసి, దానితో బంధుమిత్రులను, యువకులను కలుపుకొని సైన్యాన్ని నిర్మించాడు. సమకాలీన ముస్లిం రచనల ప్రకారం పాపన్న ధనం సేకరించి నిర్మించాడు.

పాపన్న సైన్యంలో ముఖ్యమైన వ్యక్తి మీరా సాహెబు. ఇతర ముఖ్య వ్యక్తుల్లో పేర్కొనదగినవారు హసన్, ఇమామ్, దూదేకుల పీరు, కుమ్మరి గోవిందన్న, చాకలి సర్వన్న, మంగలి మాసన్న, జానపద గాథ ప్రకారం పాపన్న మొత్తం 12 వేల మంది సైనికులను తయారుచేశాడు. ఖాఫీఖాన్ అనే 17వ శతాబ్దపు ముస్లిం చరిత్రకారుని ప్రకారం సుమారు 12 వందల మంది సైనికులను నియమించుకున్నాడు.

సైన్యాన్ని నియమించుకోవడానికి అవసరమయ్యే ధనాన్ని సంపాదించడానికి పాపన్న ధనికులు, వ్యాపారులు, జమీందారులు, సర్దార్లను దోచుకున్నాడు. వారందరూ కలిసి ప్రభుత్వ సహాయంతో పాపన్నను బంధించే పథకాన్ని రూపొందించారు. ఇది తెలిసి పాపన్న వారి ప్రాంతాలకు దూరంగా కరీంనగర్ జిల్లాలో ఉండే ఎలగందల పరగణా జమీందారు వెంకట్రావు కొలువులో పనికి కుదిరాడు. ఆ కాలంలో కరీంనగర్ జిల్లాలోని పొలవాస, మానాల జమీందార్ల మధ్య జగడాలు జరుగుతున్నాయి. పాపన్న తన జమీందారు పక్షాన ఆ జగడాల్లో పాల్గొని విజయం సాధించాడు. దాంతో పాపన్నకు తన వంటి వ్యక్తులు కొండల రాయుడు, హనుమంతులతో పరిచయమైంది.

పాపన్న.. చాకలి సర్వన్నతో కలిసి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలోని షాహ్‌పురానికి వచ్చి, అక్కడొక మట్టికోట కట్టి సైనికులను నియమించడం ప్రారంభించాడు. అందుకు ఇంకా ధనం కావాల్సి వచ్చి మళ్లీ వ్యాపారులను, గ్రామాలను దోచుకోవడం మొదలుపెట్టాడు. పాపన్న దోపిడీ విషయం ప్రజలు, ప్రభుత్వాధికారుల ద్వారా మొఘలు చక్రవర్తి ఔరంగజేబుకు తెలిసింది. వెంటనే అతడు పాపన్నను శిక్షించమని కొలనుపాకలో సర్దార్‌గా పనిచేస్తున్న రుస్తుం దిల్‌ఖాన్‌ను ఆదేశించాడు. రుస్తుం తన అనుచరుడు ఖాసింఖాన్ నాయకత్వంలో పంపిన సైన్యం షాహ్‌పురం కోటను ముట్టడించింది. దాంతో అప్పటివరకు దొంగగా ముద్రపడిన పాపన్న ఒక భారతదేశస్థాయి చక్రవర్తి ఔరంగజేబు పంపిన సైన్యంతో పోరాడాల్సి వచ్చింది. ఆ సైన్యాన్ని ఎదిరించినట్లయితే తాము రాజకీయంగా ఎదగవచ్చు అనే ఉద్దేశంతో అర్థమై పాపన్న, అతని సైన్యం ఖాసింఖాన్ సైన్యాన్ని ఎదుర్కొని ఓడించారు. పాపన్న ఖాసింఖాన్‌ను చంపాడు.

పాపన్న శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశానని రుస్తుం దిల్‌ఖాన్ తెలుసుకొని వెంటనే వేలకొలది సైనికులను వెంటేసుకొని వెళ్లి షాహ్‌పురం కోటను ముట్టడించాడు. దిల్‌ఖాన్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదనుకొని కోటలోని రహస్య ద్వారం నుంచి తప్పించుకొని పారిపోయాడు.

రుస్తుం దిల్‌ఖాన్ కొలనుపాకకు వెళ్లిపోగానే పాపన్న సైనిక బలగాలను అధిక సంఖ్యలో నియమించుకొని వచ్చి, షాహ్‌పురం కోటను ముట్టడించి, కాపలా ఉన్న సైనికులను ఓడించి కోటను వశపర్చుకున్నాడు. ఆ వెంటనే షాహ్‌పురం మట్టికోట స్థానంలో రాతి కోటను బలిష్టంగా నిర్మించాడు. ఆధునిక ఆయుధాలు అంటే తుపాకులు, మందుగుండు సామాగ్రి, ఫిరంగులు సమకూర్చుకున్నాడు.
పాపన్న బలపడుతున్న సంగతి తెలుసుకొని రుస్తుం దిల్‌ఖాన్ షాహ్‌పురం కోటపై మళ్లీ దండయాత్ర చేశాడు. యుద్ధ సమయంలో పుర్దిల్‌ఖాన్ అనే జమేదారు కత్తివేటుకు పాపన్న ప్రధాన అనుచరుడు చాకలి సర్వాయ బలయ్యాడు. అప్పటినుంచి అతని పేరునే (సర్వాయ) పాపన్న తన పేరు ముందు పెట్టుకున్నాడంటారు.

1707లో మొఘల్ సామ్రాట్ ఔరంగజేబు చనిపోయాడు. సింహాసనం కోసం ఢిల్లీలో అతని వారసుల మధ్య పోరు మొదలైంది. ఆ కాలంలో దక్కన్ ప్రాంత వ్యవహారాలు చూస్తున్న ఔరంగజేబు కొడుకు కాంబక్ష్ కూడా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల మీద దృష్టి పెట్టి తెలంగాణలో పరిణామాలను అలక్ష్యం చేశాడు. ఇదే అదనుగా భావించిన పాపన్న నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ మీద కోట కట్టాడు. వరంగల్ జిల్లా తాటికొండలో మరో కోట కట్టాడు. మరింత సైనిక బలాన్ని పెంచుకున్నాడు.

ఆత్మవిశ్వాసం పెంచుకున్న తర్వాత 1708 ఏప్రిల్ 1న వరంగల్ ప్రజలు మొహర్రం పండుగ జరుపుకుంటున్న సమయంలో పాపన్న రెండుమూడు వందల పదాతిదళం, నాలుగైదు వందల ఆశ్విక దళంతో ఓరుగల్లును (వరంగల్) ముట్టడించాడు. ఓరుగల్లు కోటను గెలిచిన ఉత్సాహంతో పాపన్న తన సైన్యంతో వెళ్లి భువనగిరి కోటపై దండెత్తి, దుర్గ పాలకున్ని ఓడించి కోటను స్వాధీనపరుచుకున్నాడు.

తెలంగాణకు గుండెకాయ వంటి ప్రాంతంలోని ఓరుగల్లు, భువనగిరి వంటి శత్రుదుర్భేద్య కోటలను పాపన్న అవలీలగా స్వాధీనం చేసుకొని సంపదను కొల్లగొట్టడం, ముస్లిం సైనికులను, సర్దారులను చంపడం అనేక మంది ముస్లిం సర్దారులకు కోపం తెప్పించింది. పాపన్న కూడా సర్దారు అని పిలువబడే స్థాయికి ఎదగడం కొందరికి కంటగింపయింది. అలాంటి వారిలో షాహె ఇనాయత్ అనే వ్యక్తి ఢిల్లీకి వెళ్లి ఔరంగజేబు తర్వాత మెఘల్ చక్రవర్తి ఐన బహదూర్‌షాకు పిర్యాధు చేశాడు. దాంతో బహదూర్‌షా పాపన్నను చంపుమని హైదరాబాద్ సుబేదార్ యూసఫ్‌ఖాన్ రుజ్ బహానికి ఆదేశాలిచ్చాడు. యూసఫ్‌ఖాన్ ప్రధాన సేనాని దిలావర్‌ఖాన్ సైనిక బలగాలతో వెళ్లి పాపన్న ఉన్న షాహ్‌పురం కోటను ముట్టడించాడు. దాంతో ఓటమి తప్పదని అర్థమైన పాపన్న రహస్య మార్గం గుండా తప్పించుకొని తాటికొండ కోటకు చేరాడు.

పాపన్న తాటికొండలో మరింత సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఈ లోగా దిలావర్‌ఖాన్ సైనిక బలగాలతో షాహ్‌పురం నుంచి వచ్చి తాటికొండ కోటను ముట్టడించాడు.
తాటికొండలో కూడా పరాజయం తప్పదని భావించి పాపన్న కొద్దిమంది అనుచరులతో కలిసి కోట నుంచి తప్పించుకొని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ సమీపంలోని సర్వాయిపేటకు వెళ్లాడు. అక్కడ కోట కట్టి బలపడుతున్న సమయంలో ఒక పేరు తెలియని నమ్మకద్రోహి గూఢచర్యం ద్వారా ముస్లిం సైన్యాలకు చిక్కాడు. యూసఫ్‌ఖాన్ రుజ్ బహానీ పాపన్న తలను నరికి గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీయించాడు. మొండన్నేమో ఢిల్లీలోని మొఘల్ చక్రవర్తి బహదూర్‌షాకు కానుకగా పంపాడు. జానపద ఆధారాలేమో పాపన్న గోల్కొండ కోటను వశపరుచుకొని ఏడు ఘడియలు ఏలాక చనిపోయాడని తెలుపుతాయి.

Comment here!